Ad Code

Political News: దెందులూరులో వేడెక్కుతున్న రాజకీయం, టీడీపీ కి కంచుకోటగా ఉన్న ఈ ప్రాతంలో ఎవరు గెలుస్తారు?

denduluru constituency political news


ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం మళ్లీ వేడెక్కుతుంది. ఏపీలో దెందులూరుకి స్పెషల్‌ క్రేజ్‌ కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగితే వాటిలో 14 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. రానున్న ఎన్నికలలో గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు కసరత్తులు మొదలుపెట్టారు.

దెందులూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్‌. మొదటిగా దెందులూరు నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తొచ్చేది చింతమనేని ప్రభాకర్‌. ఆయన ఫైర్‌ బ్రాండ్‌గా పేరు పొందారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఆయనే కనిపిస్తుంటారు. ఆయన అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. చింతమనేని మొదటి సారిగా టీడీపీ నుంచి 2001లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దెందులూరు నుంచి టీటీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రామచంద్రరావుపై 14,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2014లో మరోసారి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. చింతమనేని రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. 2019లో జరిగిన ఎన్నికలలో తన సమీప వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో 17,459 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

                         denduluru map

ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న దెందులూరు తర్వాత పసుపు కోటగా మారిపోయింది. ప్రధానంగా టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉండేది. దానికి ప్రధాన కారణం మాస్‌ డైలాగ్‌లతో ప్రతిపక్ష నేతలపై చింతమనేని చేసిన వివదాలు, ఆరోపణలు, విమర్శలు గుప్పించడం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వోపై దాడి జరగడంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి చింతమనేని పేరు దెందులూరులోనే కాదు, ఏపీ మొత్తం ఆయన పేరు వినిపించింది. వివాదాలకు మారు పేరుగా చింతమనేని ప్రభాకర్‌ మారారు.

2019లో జరిగిన ఎన్నికలలో చింతమనేని ప్రభాకర్‌ ఓటమి పాలైనప్పటికీ ఆయన ఏ మాత్రం తగ్గలేదు. అధికార పక్షం నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన స్పీడ్‌ తగ్గించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ప్రజలు రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీ మంత్రులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు రాగానే వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో ఎలాంటి డెవలప్‌మెంట్‌ లేదని చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు పరిస్థితులు ఏమాత్రం మారలేదని సెల్ఫీలు తీసి ఛాలెంజ్‌ విసిరారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

పవన్‌ కళ్యాణ్‌ను గెలిపిస్తా

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై చింతమనేని ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను తన భుజాలపై ఎక్కుంచుకుని గెలిపిస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పవన్‌ కళ్యాణ్‌ కోసం తన సీటును త్యాగం చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి పవన్‌ ప్రశ్నిస్తున్నారని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిజంగా దెందులూరును కోరుకుంటే తన సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

నిత్యం విమర్శలు, ఆరోపణలతో చింతమనేని

చింతమనేని ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వోపై దురుసుగా ప్రవర్తించి ఆయన వార్తల్లో నిలిచారు. అలాగే చింతమనేని ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంగన్‌వాడీ మహిళలు, ఫారెస్ట్‌ అధికారులపై ఆయన తీరు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఎస్సీలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఆయన లాంటి వాళ్లు ఎమ్మెల్యేగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. రౌడీయిజం చేసే వాళ్లకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని కుల వ్యతిరేక సంఘాల నాయకులు పేర్కొన్నారు. అలాగే దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం వీరమ్మగుంట గ్రామంలో పంచాయతీ ఉపఎన్నికలు జరిగాయి. పోలీంగ్‌ పరిస్థితిని పరిశీలించేందుకు పోలీంగ్‌ కేంద్రం వద్దకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌ను డీఎస్పీ అశోక్‌ కుమార్‌ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మరోసారి చింతమనేని వివాదాల్లోకి చేరారు.

కాన్ఫిడెంట్‌గా చింతమనేని ప్రభాకర్‌

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంతో ప్రతి ఇంటికి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చెప్తూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎమ్మెల్యే ప్రజలు తెలపాలన్నారు. వైసీపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈసారి ఎలాగైన విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. దూకుడుగా ప్రచారం మొదలుపెట్టారు.


అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నాం: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

దెందులూరు నియోజకవర్గంలో గత ఎన్నికలలో వైసీపీ జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. దెందులూరులో ఎవరూ ఊహించని విధంగా చింతమనేనిని అబ్బయ్య చౌదరి ఓడించారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి మహిళలు హారతులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే ప్రజలకు వివరిస్తున్నారు.

దెందులూరులో వైసీపీ జెండా

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెగ్మెంట్‌లలో దెందులూరు నియోజకవర్గం ఒకటి. ఎట్టిపరిస్థితుల్లో దెందులూరులో వైసీపీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విదేశాలలో స్థిరపడిన అబ్బయ్య చౌదరిని దెందులూరు బరిలోకి దించి వైసీపీ గెలిపించింది. చింతమనేనిపై 16 వేల ఓట్లకు పైచిలుకు మెజారిటీతో అబ్బయ్య చౌదరి గెలుపొందారు. నాలుగేళ్లుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు. ప్రజల వద్ద మంచి పేరును సంపాదించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రజల దృష్టి ఏ మాత్రం టీడీపీ వైపు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 17 వందల కోట్ల రూపాయలతో వివధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల్లో జరగబోయే ఎన్నికలలో మళ్లీ తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు సీఎం జగన్‌ వెంటే ఉంటారని తేల్చి చెప్తున్నారు. దెందులూరులో మళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.


ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీ నేతలు ఫైర్‌

దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీలోనే అసమ్మతిరేగింది. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికలలో 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని, ఈసారి 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఎంతో ప్రయాసపడి ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరిని గెలిపించారన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారిని పక్కనపెట్టి సొంత కోటరీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టీ మాఫియా, భూకబ్జాలు, కోడిపందాలు, చేపల చెరువుల అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో ఎమ్మెల్యే అబ్బయ్య చౌరి పార్టీకి చెడ్డ పేరు తీసుకోస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే తప్ప పార్టీకీ పనిచేసే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యేపై నరసింహమూర్తి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే పలు గ్రామాల ప్రజలు తమకు సరైన రోడ్లు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలలో ఏర్పడిన ఈ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది.

ఎన్నికలు దగ్గర పడటంతో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని పోటీపడుతున్నారు. సరైనోడు తగలనంత వరకూ ఎవరైన పేలతారని చింతమనేని కౌంటర్లు వెస్తున్నారు. అసలు సినిమా ముందు ఉందని స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. వీరి మధ్య మాటల యుద్ధం దెందులూరులో దుమారం రేపుతుంది. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. మరి ఎవరికి ఎవరు చెక్‌ పెడతారో మరి కొన్ని నెలల్లో తెలియనుంది


Post a Comment

0 Comments